Ticker

6/recent/ticker-posts

ప్రకృతి సాగుతో ఆదాయం, ఆరోగ్యం : మంత్రి సవిత


విజయవాడ, మార్చి 7: ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. వ్యవసాయం భారం కాకుండా లాభసాటి కావాలంటే ప్రకృతి సాగు సరైన విధానమని స్పష్టం చేశారు.


విజయవాడలోని ఓ హోటల్‌లో శనివారం ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల కోసం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై వర్క్‌షాప్‌లో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. ప్రకృతి సాగుపై వర్క్‌షాప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యున్నతికి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు స్వయం సమృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలో అత్యధిక మంది జీవనాధారం వ్యవసాయమేనని, ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో వ్యవసాయ పెట్టుబడి భారంగా మారిందన్నారు.

వ్యవసాయ ఖర్చును తగ్గిస్తూ లాభాలను పెంచడానికి ప్రకృతి సాగు ఎంతో దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. రసాయనాలపై ఆధారపడకుండా సహజ వనరులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని చెప్పారు. జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ వనరుల వినియోగంతో నేల సారం పెరుగుతుందని తెలిపారు.

కరోనా అనంతరం ప్రజల ఆహారపు అలవాట్లు మారి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని, ఆర్గానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని మంత్రి సవిత తెలిపారు. ప్రకృతి సాగు ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు అధిక ధరతో పాటు డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నారు.

ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన రైతులు ప్రకృతి సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి వర్క్‌షాప్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ రైతు సాధికార సమితి వైస్ చైర్మన్ టి. విజయ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సునీత మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై ఆర్థిక వెనుకబడిన వర్గాల్లో అవగాహన పెంచేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.

కార్యక్రమానికి ముందు సేంద్రీయ ఎరువులతో సాగుచేసిన కూరగాయలు, అపరాలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. రైతులు ఉపయోగించిన సహజ వనరుల గురించి అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. అనంతరం వర్క్‌షాప్‌ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డూండీ రాకేశ్, ఈడబ్ల్యూఎస్ అధికారులు మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.