Ticker

6/recent/ticker-posts

రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తే గీటురాయి : కలెక్టర్ లక్ష్మీశ


ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి 07: రెవెన్యూ సేవల్లో ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు గీటురాయిగా భావించాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, సేవల అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


శనివారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు తదితరులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న ముఖ్యమైన శాఖ అని, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తారని తెలిపారు. అందువల్ల ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు.

పీజీఆర్ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. అసైన్‌మెంట్స్‌, 22(ఏ) తొలగింపు, మ్యుటేషన్‌, రీసర్వే గ్రీవెన్సులు వంటి అంశాలపై వచ్చే దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం కల్పించాలని పేర్కొన్నారు.

భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని, సర్వేలు సమయానికి పూర్తి చేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని తెలిపారు. ఆర్‌డీవోల స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ల సేవలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని చెప్పారు.

అలాగే వాట్సాప్ మనమిత్ర సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సహజ వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెరువులు, కాలువలు, వాగులు, కుంటలు వంటి జల వనరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆదేశించారు. జల వనరులు ప్రజలకు విలువైన సంపద అని, భవిష్యత్ తరాల కోసం వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యత అని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

ఈ సమావేశంలో విజయవాడ ఆర్‌డీవో టీవీ సతీష్, నందిగామ ఆర్‌డీవో కె. బాలకృష్ణ, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ కె. పోసిబాబు తదితరులు పాల్గొన్నారు.