జంగారెడ్డిగూడెం, మార్చి 1: కొయ్యలగూడెం మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని, తమ వ్యవసాయ భూములను ఏ పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని ఆయా గ్రామాల రైతులు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జంగారెడ్డిగూడెంలోని సౌభాగ్య థియేటర్ వద్ద మెట్టప్రాంత ప్రముఖులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబును కలిసి గ్రామస్తులు తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
కొయ్యలగూడెం మండలంలోని మంగపతిదేవిపేట, బోడిగూడెం, బరికేటినగరం, రేగులకుంట గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ, తమ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు పేరుతో భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామాలు అలాగే ఉంటాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వ్యవసాయ భూములు కోల్పోతే జీవనాధారం లేకుండా పోతుందని రైతులు వాపోయారు.
చిన్న, సన్నకారు రైతులైన తమకు వ్యవసాయం ఒక్కటే జీవనాధారమని, భూములు కోల్పోతే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని తెలిపారు. ఈ సమస్య నుంచి తమను గట్టెక్కించాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబును రైతులు కోరారు.
ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంగపతిదేవిపేట గ్రామ సర్పంచ్ అబ్బు సుబ్రహ్మణ్యం, గన్నమని రత్నాజీ, బొట్టా శ్రీనివాసరావు, బోడిగూడెం గ్రామానికి చెందిన ఏకుల శ్రీను, జక్కు నాగు, బరికేటినగరం గ్రామానికి చెందిన కానూరు శ్రీనివాసరావు, ఎడ్లపల్లి బాబురావు, రేగులకుంట గ్రామానికి చెందిన సుగ్గనబోయిన ఏడుకొండలు, చల్లా రామకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు.


.jpeg)
