Ticker

6/recent/ticker-posts

పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీలు నిర్ణీత గడువులో పరిష్కరించాలి


 

అర్జీదారులు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలి – జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, మార్చి 2:
జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటిని నిర్ణీత సమయంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, కెఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ ఎల్. దేవకిదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి తదితరులు ప్రజల అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్‌ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్‌లలో అందిన అర్జీలను గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కొన్ని ముఖ్య అర్జీలు:

  • దెందులూరు మండలం, సత్యనారాయణపురం గ్రామంకు చెందిన పర్వతనేని రంగారావు ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు గిట్టుబాటు ధర లభించిందని, పెసలు, మినుములు వంటి పంటలకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

  • ముసునూరు మండలం, వేల్పుచర్ల గ్రామంకు చెందిన కడలి సత్యనారాయణ పామాయిల్ పంట కోసం బోరు వేయడానికి రుణం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామంకు చెందిన కనుమతరెడ్డి జగన్మోహన్ రెడ్డి పంట పొలాలకు వెళ్లే రహదారి కబ్జాకు గురైందని, విచారణ చేసి రాకపోకలకు రహదారి ఏర్పాటు చేయాలని కోరారు.

  • భీమడోలు మండలం, దుద్దెపూడి గ్రామంకు చెందిన పూని దశరథ రామారావు అంబేద్కర్ కాలనీలో డ్రైనేజీ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

  • కొయ్యలగూడెం మండలం, రాజవరం గ్రామంకు చెందిన పుట్టా రామలక్ష్మి అసంపూర్తిగా మిగిలిన ఇల్లు పూర్తి చేసుకోవడానికి రుణం లేదా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

మండలాల వారీగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ ప్రత్యేక కౌంటర్లలో భూసేకరణ, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, ఇతర భూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ ఏఓ ఎన్.వి. నాంచారయ్య, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.