భీమడోలు, మార్చి 1: బాణాసంచా నిల్వ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గుండుగొలను గ్రామంలోని హోల్‌సేల్ టపాకాయల దుకాణాల్లో ఆదివారం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో భీమడోలు ఇన్‌స్పెక్టర్ యు.జె. విల్సన్, ఎస్‌ఐ మదీనా భాషా, అగ్నిమాపక శాఖ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఫైర్ క్రాకర్స్ వ్యాపారులు మద్దుల పరమేశ్వరరావు తదితరుల నిల్వ కేంద్రాలను పరిశీలించారు.
అగ్ని ప్రమాదాల నివారణ కోసం ప్రతి నిల్వ కేంద్రంలో పనిచేసే స్థితిలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇసుక బకెట్లు మరియు తగినంత నీటి నిల్వ ఉండాలని అధికారులు ఆదేశించారు. అనుమతించిన పరిమితికి మించి బాణాసంచా నిల్వ చేయరాదని, గడువు ముగిసిన లైసెన్సులను వెంటనే పునరుద్ధరించుకోవాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్‌ను క్రమంగా నిర్వహించాలని తెలిపారు.
నిల్వ కేంద్రాల్లో విద్యుత్ వైరింగ్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు నివారించాలని హెచ్చరించారు. గోదాములలో మరియు పరిసర ప్రాంతాల్లో పొగ త్రాగడం పూర్తిగా నిషేధించాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు ఎగ్జిట్ మార్గాలు ఉండాలని, టపాకాయల పెట్టెలను క్రమపద్ధతిలో అమర్చాలని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని భీమడోలు ఇన్‌స్పెక్టర్ యు.జె. విల్సన్ హెచ్చరించారు.
అక్రమ బాణాసంచా నిల్వలు లేదా తయారీపై సమాచారం ఉన్నవారు డయల్ 112 లేదా భీమడోలు ఇన్‌స్పెక్టర్ ఫోన్ నంబర్ 9440796651 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


.jpeg)
