ఏలూరు, మార్చి, 10: మహిళల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి పూలే అని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ఏలూరు ఏరియా సమితి నాయకులు కొనియాడారు. స్త్రీలపై జరుగుతున్న వివక్షలను ధిక్కరించి మహిళా విద్యకు పునాది వేసిన ధీర వనితగా ఆమెను స్మరించారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని స్ఫూర్తి భవన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఏరియా సమితి అధ్యక్షురాలు కొండేటి బేబీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా “జోహార్ సావిత్రిబాయి పూలే”, “సాధిస్తాం సావిత్రిబాయి పూలే ఆశయాలు”, “వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏరియా సమితి అధ్యక్షురాలు కొండేటి బేబీ, కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళలపై జరుగుతున్న సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలకు పునాది వేసి, మహిళలకు విద్య హక్కు కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు అని కొనియాడారు.
ఆ కాలంలో మహిళలు చదువుకోవడాన్ని సమాజం తప్పుగా చూసినప్పటికీ, సావిత్రిబాయి పూలే ఆ అవమానాలను ఎదుర్కొంటూ మహిళలకు విద్య అందించేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు. 1848లో సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే కలిసి పుణేలో బాలికల కోసం దేశంలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
అనాధ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించిన మహనీయురాలని పేర్కొన్నారు. 1897లో ప్లేగు మహమ్మారి వ్యాప్తి సమయంలో రోగులకు సేవలు అందిస్తూనే ఆమె కూడా ఆ వ్యాధికి గురై మార్చి 10, 1897న మరణించారని తెలిపారు. ప్రజల సేవలో తన ప్రాణాలను అర్పించడం ఆమె గొప్ప త్యాగానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె ఆలోచనలు, ఆదర్శాలను స్మరించుకుంటూ మహిళలపై పెరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం ఆమెకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని, ఈ పోరాటాలలో మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి, జిల్లా సహాయ కార్యదర్శి గొర్లి స్వాతి, ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యులు ఉప్పులూరి లక్ష్మి, భవాని, వెదురుపర్తి శారద, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.



.jpeg)