Ticker

6/recent/ticker-posts

జిల్లా పరిషత్ సమావేశంలో కీలక నిర్ణయాలు – బడ్జెట్ ఆమోదం, అభివృద్ధిపై దృష్టి


ఏలూరు: ఏలూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షత వహించారు. వేసవిలో త్రాగునీటి సరఫరా, వైద్య సేవలు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.


సమావేశంలో ప్రజలకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చెరువులు, ట్యాంకులు నింపే పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపరచాలని సూచించారు.

శాసనమండలి సభ్యుడు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన రైతు సేవా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు విద్యుత్ లేక వినియోగంలోకి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరతను కూడా ప్రస్తావించారు.

జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ జిల్లాలో వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి కొరత లేదని తెలిపారు. గృహ, వాణిజ్య, విద్యాసంస్థల అవసరాలకు సరిపడా గ్యాస్ అందిస్తున్నామని వెల్లడించారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.14 కోట్లకు పైగా బడ్జెట్ ప్రతిపాదనలను సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.