ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పోలవరం నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల సాయి, కార్యదర్శి గంజి మధుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన సుమారు 11 ప్రధాన డిమాండ్ల సాధన కోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు మరియు గృహాల కేటాయింపు సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రమాద భీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మీడియా హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, కార్పొరేట్ సంస్థల సహకారంతో జర్నలిస్టులకు ఉచిత విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి కుటుంబాల భద్రత కోసం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దశల వారీగా ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులకు వినతిపత్రాలు అందజేశామని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమస్యలను మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
మార్చి 4న ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించి, అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న సభకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మరియు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌లను ఆహ్వానించినట్లు తెలిపారు. మంత్రుల సమక్షంలో జర్నలిస్టుల సమస్యలను వివరించి పరిష్కారం కోరనున్నట్లు చెప్పారు.
పోలవరం నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కమిటీ పిలుపునిచ్చింది.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు చాపల లక్ష్మణ్, ట్రెజరర్ చిట్టిబొమ్మ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు సిరిశెట్టి రాఘవులు, కొల్లం రవికుమార్, కంచర్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
