జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బాణాసంచా నిల్వ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో పెదవేగి ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్ పర్యవేక్షణలో ఆదివారం ఏపూరు గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పెదపాడు ఎస్‌ఐ ఆర్. శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్ వి.వి. రామారావు, నూజివీడు అగ్నిమాపక అధికారి జి. నాగరాజు సంయుక్తంగా ఏపూరు గ్రామంలోని లక్ష్మీనారాయణ క్రాకర్స్ షాప్ మరియు గోడౌన్ పై దాడి నిర్వహించారు.
తనిఖీల్లో ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అనుమతించిన పరిమితికి మించి అత్యంత ప్రమాదకర రీతిలో బాణాసంచా నిల్వ చేసినట్లు గుర్తించారు. దీంతో సుమారు రూ.30,00,000 విలువైన బాణాసంచా స్టాక్‌ను స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాణాసంచా నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లైసెన్స్‌లో పేర్కొన్న పరిమితికి మించి బాణాసంచా నిల్వ చేయరాదని, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


.jpeg)
