Ticker

6/recent/ticker-posts

దేశవ్యాప్తంగా 203 పంచకర్మ యూనిట్లకు ఆమోదం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం


ఏలూరు/న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో జరిగిన లోక్ సభ సమావేశంలో నేషనల్ ఆయుష్ మిషన్ కింద దేశవ్యాప్తంగా పంచకర్మ వైద్య సేవల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆయుష్ వ్యవహారాల మంత్రి ప్రతాప్రరావు జాదవ్ శుక్రవారం సమాధానం ఇచ్చారు.


కేంద్ర మంత్రి వివరాల ప్రకారం జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద 2014-15 నుంచి 2024-25 మధ్య రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 203 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ (IAH) యూనిట్ల స్థాపనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

పంచకర్మ చికిత్సల కోసం జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక యూనిట్ల వివరాలను వెల్లడిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ మరియు విశాఖపట్నం జిల్లా ఆసుపత్రుల్లో నూతన భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. వీటిలో 50 పడకలతో కూడిన థెరపీ గదులు మరియు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాకినాడలో భవన నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిందని, విశాఖపట్నంలో నిర్మాణం కొనసాగుతున్నదని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇక పంచకర్మ యూనిట్లలో అందించే వైద్య సేవలు, రోగుల సంఖ్యపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు స్పందిస్తూ, ఈ కేంద్రాల్లో ఆయుర్వేద, హోమియోపతి, యోగా, నాచురోపతి వంటి చికిత్సలు అందిస్తారని తెలిపారు. అయితే ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలో ఉండటంతో నిర్వహణ, చికిత్స పొందిన రోగుల వివరాలను ఆయా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలే నిర్వహిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.