-ఎన్టీఆర్ లాంటి వ్యక్తి యుగానికొక్కడే పుడతాడు - ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఏలూరు జిల్లా,ఏలూరు: మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మీడియాకు ప్రకటన విడుదల చేసిన ఎంపీ, ఎన్టీఆర్ అంటేనే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక సంచలనం అని, సినిమాల్లో రాముడిగా, కృష్ణుడిగా తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏ నటుడు చేయనన్ని గొప్ప పాత్రలను పోషించిన మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర సృష్టించిన అసాధారణ వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగువాడిగా పుట్టి, దేశ రాజకీయాలనే మలుపుతిప్పిన గొప్ప నాయకుడు ఆయనేనని అన్నారు.
ఈరోజు బీసీ కులాలకు చెందిన తనలాంటి ఎంతోమంది రాజకీయాల్లోకి రావడానికి ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని ఎంపీ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, పేదల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
ఎన్టీఆర్ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో రాష్ట్రంలో మరో 20–30 ఏళ్లపాటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందనే ఆశాభావాన్ని పుట్టా మహేష్ కుమార్ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లాంటి మహా మనీషి యుగానికి ఒక్కడే పుడతాడని పేర్కొంటూ, త్వరలోనే రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టు కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలిపారు.


.jpeg)
