Ticker

6/recent/ticker-posts

గానగంధర్వుడు ఘంటసాల జీవితం అందరికీ ఆదర్శం: శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్


ఏలూరు జిల్లా,చింతలపూడి: గానగంధర్వుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన పాడిన పాటలు నేటికీ ఆణిముత్యాల్లా నిలిచాయని శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అన్నారు.


చింతలపూడి పట్టణం రత్న కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వేగి లింగేశ్వర స్వామి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహాన్ని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం విగ్రహ దాత మారుమూడి తామస్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణం, మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొని ఘంటసాల గారి సేవలను కొనియాడారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ఘంటసాల గారు సుమారు పదివేలకు పైగా పాటలు పాడారని, ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాకుండా స్వతంత్ర సమరయోధుడు కూడా అని తెలిపారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని, అతి సాధారణ కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఘంటసాల గారి కృషి మర్చిపోలేనిదని ఆయన అన్నారు.

చింతలపూడి పట్టణంలో ట్యాంక్ బండ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌లో భాగంగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా విగ్రహాలన్నింటినీ అందరి సహకారంతో ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులకు ఘంటసాల గారు తనదైన శైలిలో అద్భుతమైన పాటలు పాడి చిరస్మరణీయులయ్యారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మధ్య మధ్యలో జూనియర్ ఘంటసాల ఆచారి ఘంటసాల గారి గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. అనంతరం శాసనసభ్యులను దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, ఘంటసాల అభిమానులు, యువత భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.