ఏలూరు, జనవరి 09: స్థానిక రెవిన్యూ అతిధిగృహంలో శుక్రవారం ప్రజాధర్భార్ నిర్వహించి, ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు నుండి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమీషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమీషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ నోటిఫికేషన్లు, వంటి ప్రభుత్వాన్ని సంబంధించిన అన్నింటిపైనా కమిషన్ కు పర్యవేక్షణ చేసే అధికారం ఉందన్నారు. భారత రాజ్యాంగంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కల్పించిన హక్కులను కాపాడటంతో పాటు నిర్లక్ష్యం చేసిన అధికార్లుపై కమిషన్ స్పందించి తదనుగుణంగా చర్యలకు సిఫార్సు చెయ్యడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో 2018 తర్వాత ఎస్సీ కమిషన్ సరిగ్గా పనిచేయ లేదని, ఎస్సీ వర్గాలు ప్రజలు, సంఘాలు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో క్రొత్త ఎస్సీ కమిషన్ ఏర్పడిందని మరలా పూర్వవైభవం తీసుకు వస్తామని అన్నారు. ఏలూరులో ఎక్కువ కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎస్సీ అట్రాసిటీ కేసులు 34, భూసమస్యలు 22, సాధారణ కేసులు 21 ఉన్నాయని అన్నారు. ఏలూరు జిల్లా కొందరు అధికారులకు ఫోన్ చేసినా మీటింగులో ఉన్నామని చెపుతున్నారని, మీటింగు అయిన తర్వాత తిరిగి ఫోన్ చెయ్యుటలేదని అసహనం వ్యక్తం చేశారు.
పోలవరం తహశీల్దారుకు రెండు కేసులు ఎస్సీ కమిషన్ పంపినా నేటివరకు పరిష్కారం కాలేదని, ఇదే సంఘటనలు పునరావతం అయితే యస్సి కమిషన్ సీరియస్ గా తీసుకుంటుందని అన్నారు. ఏ ప్రభుత్వ అధికారి అయినను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోయినా, నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే అటువంటి సంఘటనలు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులను కమిషన్ కు పిలిపించి విచారణ చేస్తామని అన్నారు.
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, కులవివక్ష చూపినా కమిషన్ ఒక కన్నేసి ఉంచుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను అమలు చేయకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని, అందించడంలో అధికార్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజ్యాంగం లో ఎస్సీ, ఎస్టీలకు అనేక హక్కులు ఉన్నాయని నిర్లక్ష్యం చేస్తే కమిషన్ స్పందించి తదనుగుణంగా చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడడంలో కమిషన్ ముందుంటుందన్నారు. యస్సి కమిషన్ కు రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత ఉందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను పర్యవేక్షించే అధికారం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపి ఎస్సీ కమిషన్ కార్యదర్శి చిన్న రాముడు, ఏపి యస్సి కార్పొరేషన్ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ డిడి వై. విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం. ముక్కంటి, తహశీల్దారు కె.గాయత్రిదేవి, సంబంధిత అధికారులు, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారులు, ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
