Ticker

6/recent/ticker-posts

అమ్మబాబోయ్.. ఆఫీస్ అటెండర్‌కు రూ. కోటి ఆస్తులు.. ఏసీబీ అధికారులే షాక్..


ANDRAPRADESH: విశాఖపట్నంలో ఓ అటెండర్ ఇంట్లో లభించిన ఆస్తి పత్రాల విలువ చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. విశాఖపట్నంలో మంగళవారం రోజున ఏసీబీ అధికారులు పలువురు ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. సూపర్‌బజార్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే కొంతమంది ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా.. ఆనంద్ కుమార్ అనే అటెండర్ ఇంట్లో కోటి రూపాయలు విలువైన స్థిర, చరాస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్ ఇంట్లోనూ కోటి రూపాయల ఆస్తులను గుర్తించారు.


భారతదేశాన్ని ప్రధానంగా పట్టి పీడిస్తున్న సమస్యలలో అవినీతి ఒకటి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రభుత్వ శాఖల్లో కొంతమంది అవినీతి అధికారుల చేతివాటం మాత్రం ఆగడం లేదు. కొన్ని కార్యాలయాల్లో దరఖాస్తు మొదలుకొని ఆమోదం వరకూ చేయి తడపనిదే.. పని కావటం లేదు. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాలో ఓ గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్‌గా పనిచేసే వ్యక్తికి రూ. కోటి విలువైన ఆస్తులు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అవినీతి నిరోధఖ శాఖ అధికారులు.. నవంబర్ నెలలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మంగళవారం కొంతమంది ఉద్యోగుల ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భారీగా స్థిర, చరాస్తులను వారు కూడబెట్టిన సంగతిని గుర్తించారు. ఈ క్రమంలోనే సూపర్‌బజార్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో అటెండర్‌గా పని చేసే ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారులు.. రూ.కోటి విలువైన ఆస్తులను గుర్తించి షాక్ తిన్నారు. ఇక ఇదే ఆఫీసులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధారాణి ఇంట్లోనూ భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. సుమారుగా రూ.కోటి విలువైన స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్‌ మోహనరావు నివాసంలోనూ స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో నగదు, బంగారు నగలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు నవంబర్ 5వ తేదీన సూపర్‌బజార్‌ ఆఫీసుతో పాటుగా పెదగంట్యాడ, మధురవాడలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల్లో చూపని పది వేల రూపాయలను సూపర్‌బజార్‌ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల పాటుు కీలక డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. తమ దర్యాప్తు కొనసాగించారు.

ఈ క్రమంలోనే మంగళవారం రోజున సూపర్‌బజార్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్ సిబ్బంది ఇళ్లల్లో ఒకేసారి నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అటెండర్ ఇంట్లో కోటి రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. నాలుగు చోట్ల జరిపిన సోదాల్లో నగలు, నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.