Ticker

6/recent/ticker-posts

అన్‌లైన్ కంటెంట్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు


INDIA, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌పై ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తులు సొంతంగా ఛానెళ్లు ప్రారంభించి.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వింతగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. గురువారం యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా కేసులో విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారం గురించి ప్రశ్నించడం ద్వారా యూట్యూబర్ రణవీర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.


ఈ కేసులో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఇది కేవలం అశ్లీలతకు సంబంధించిన అంశమే కాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో యూజర్లు జనరేట్ చేస్తోన్న కంటెంట్‌లోని లోపాలను సైతం ఎత్తిచూపుతోందని తెలిపారు. భావ వ్యక్తకరణ స్వేచ్ఛ అనేది ఒక అమూల్యమైన హక్కు అని అభివర్ణించారు. దానిని వక్రీకరించడం సరికాదని కోర్టుకు ఆయన విన్నవించారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. తాను సొంతంగా ఛానెల్ పెట్టాను. తాను ఎవరకీ జవాబుదారీగా ఉండను అనే సంకేతాలు వెళ్తున్నాయని.. ఇది సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ కంటెంట్ విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ కంటెంట్‌ను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. వినియోగదారులు సృష్టించిన సోషల్ మీడియా కంటెంట్‌ను నియంత్రించేలా నిబంధనలు తీసుకురావాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.