ANDRAPRADESH, KAKINADA: కాకినాడలో ఓ తండ్రి తన కొడుకును కొట్టారని కోపంతో స్కూల్ గేటుకు తాళం వేశాడు. దీంతో 500 మంది విద్యార్థులు, టీచర్లు లోపలే ఉండిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి తాళం తీయించి, అతన్ని స్టేషన్‌కు తరలించారు. టీచర్లు పట్టించుకోలేదని తండ్రి వాపోయినా, తమకు అసలు ఫిర్యాదు రాలేదని వారు తెలిపారు. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ స్కూల్ టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.
ఓ వ్యక్తి ప్రభుత్వ స్కూల్ గేటుకు తాళం వేశాడు. తన కుమారుడ్ని మరో విద్యార్థి కొట్టాడనే కోపంతో ఇలా చేశాడు. వెంటనే టీచర్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు రంగంలోకి దిగి అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ పంచాయతీ అనంతలక్ష్మి కాలనీకి చెందిన బాషా కుమారుడు స్థానిక జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థి తన కుమారుడిని కొట్టాడని బాషాకు తెలిసింది. వెంటనే బాషా మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటి నుంచి తాళం తెచ్చి పాఠశాల ప్రధాన గేటుకు వేశాడు.
బాషా గేటుకు తాళం వేయడంతో.. దాదాపు 500 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల లోపలే ఉండిపోయారు. ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తాళం వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 15 నిమిషాల తర్వాత గేటుకు వేసిన తాళాలను తీయించి, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించి హెచ్చరించారు. తన కుమారుడిని కొట్టిన విషయం గురించి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, అందుకే తాను ఇలా చేశానని బాషా తెలిపాడు. అయితే, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు విద్యా భోదన, ఇతర పనుల్లో బిజీగా ఉండే టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ వంటి గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభచూపిన వారితో మండల జట్టును ఎంపికచేస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 13, 14 తేదీల్లో వీరు డివిజన్ స్థాయిలోజరిగే పోటీల్లో పాల్గొంటారు. డిసెంబరు 20, 21, 22 తేదీల్లో జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు హాజరవుతారు. జనవరి 2, 3, 4 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో విజేత జట్టు పాల్గొంటుంది. ఈ క్రీడల నిర్వహణకు నిర్వహణకు రూ.8.10 లక్షలు మంజూరు చేశారు.


.jpeg)
