ఇండోనేషియా పరిసరాల్లో ఏర్పడిన ‘సెన్‌యార్’ తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే.. ‘దిత్వా’ రూపంలో మరో తుఫాను రాష్ట్రంపైకి దూసుకొస్తోంది....
రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను
30న తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరంపైకి
నేటి నుంచి 4 రోజులు భారీ వర్షాలు
ANDRAPRADESH, విశాఖపట్నం/అమరావతి: ఇండోనేషియా పరిసరాల్లో ఏర్పడిన ‘సెన్‌యార్’ తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే.. ‘దిత్వా’ రూపంలో మరో తుఫాను రాష్ట్రంపైకి దూసుకొస్తోంది. దీనివల్ల కోస్తా, రాయలసీమల్లో పంటలకు నష్టం కలుగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బుధవారం అర్ధరాత్రి తర్వాత వాయుగుండగా, ఆ తర్వాత కొద్దిగంటల్లోనే తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారింది.
దీనికి యెమన్ దేశం సూచించిన ‘దిత్వా’గా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేరు పెట్టింది. తుఫాను గంటకు 10 నుంచి 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తోంది. గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలైకు 170, పుదుచ్చేరికి 570, చెన్నైకి 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 30వ తేదీ ఉదయానికి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు రానుందని ఐఎండీ తెలిపింది. పలు వాతావరణ మోడళ్ల మేరకు 30 ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకూ, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.
నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు
శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, బాపట్ల, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో(ఆదివారం) రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల కుంభవృష్టిగా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో అతిభారీగా, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతిభారీ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. శుక్రవారం నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గాలుల వేగం పెరగనున్నది. శనివారం నుంచి తీరం వెంబడి గంటకు 60 నుంచి 70, అపుడప్పుడు 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గాలుల ఉధృతి పెరుగుతుందని, పొలాల్లో వరి కుప్పలు, ఉద్యానవన పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులకు ఐఎండీ సూచించింది. ‘దిత్వా’ తుఫాన్ కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈ తుఫాను ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అన్నదాతల్లో ఆందోళన
‘దిత్వా’ తుఫాన్ అన్నదాతల్ని కలవరపెడుతోంది. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో రైతులు గాబరాపడుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి కోతలు, నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నూర్చిన ధాన్యాన్ని రోడ్ల పక్కన, ఆరుబయట, పొలాల్లో రైతులు ఆరబోశారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే.. ధాన్యం తడిచిపోతుందని ఆందోళన చెందుతున్నారు. టార్పాలిన్ పట్టాల కోసం రైతులు ఎదురుచూస్తుండగా, వాటిని సరఫరా చేస్తున్నట్లు మంత్రులు చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో పంపిణీ జరుగుతున్న దాఖలా లేదు. ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తడానికి గన్నీ బ్యాగుల కొరత ఉందని కొందరు రైతులు చెప్తున్నారు. ఇప్పటికే మొంథా తుఫాన్‌తో కోస్తా జిల్లాల్లో వరి పంట దెబ్బతింది.
కృష్ణా, గోదావరి జిల్లాల్లో ధాన్యం తడిసి, రంగుమారింది. కొన్ని చోట్ల గింజ మొలకెత్తింది. ఆ ధాన్యాన్ని మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దిత్వా తుఫాన్ దూసుకొస్తుండటంతో రైతులు కలవరం చెందుతున్నారు. ఖరీ్‌ఫలో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంలో ఇప్పటి వరకు 8.22 లక్షల టన్నులను మాత్రమే పౌరసరఫరాల సంస్థ సేకరించింది. ఇదే అదునుగా మిల్లర్లు సిండికేట్ అయ్యి, దళారుల ద్వారా ధాన్యం రైతులకు మద్దతు ధర చెల్లించకుండా, తక్కువకు అడుగుతున్నారు. అయితే, దళారీల మాట నమ్మి తక్కువ ధరకు అమ్ముకోవద్దని, ఈ-క్రా్‌పలో నమోదైన ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్ ప్రకటించారు.


.jpeg)
