Ticker

6/recent/ticker-posts

విజయసాయి, వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్.. ఈ ముగ్గురు ఊసెందుకు లేదు!

ఏపీ లిక్కర్ స్కాంలో రోజుకో ట్విస్ట్ ఇస్తోంది సిట్. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు.

ANDHRAPRADESH:ఏపీ లిక్కర్ స్కాంలో రోజుకో ట్విస్ట్ ఇస్తోంది సిట్. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు లిక్కర్ స్కాంలో 40 మంది నిందితులుగా చేర్చిన సిట్.. ఈ సంఖ్య మరింత పెరగనుందని సంకేతాలిస్తోంది. అయితే 40 మంది నిందితుల్లో ప్రస్తుతానికి 12 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. వీరిలో స్కాంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ2, ఏ3, ఏ5 విషయంలో సిట్ అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశమవుతోంది.

స్కాంలో అంతిమ లబ్ధిదారు తర్వాత పాత్ర ఏ4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదేనని సిట్ చెబుతోంది. అందుకే ఆయన అరెస్టు తప్పనిసరి అంటూ కోర్టుకు నివేదించింది. అయితే పాలసీ రూపకల్పనతోపాటు అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ2 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఏ3 దొడ్డ వెంకట సత్యప్రసాద్, ఏ5 వి.విజయసాయిరెడ్డి అరెస్టులపై సస్పెన్స్ కొనసాగుతోంది. లిక్కర్ స్కాంపై ఈ ముగ్గురిని పలుమార్లు విచారించిన సిట్ తొలి చార్జిషీటు దాఖలు సమయంలోనూ అరెస్టు చూపించక పోవడంపై రాజకీయ, న్యాయవాద వర్గల్లో చర్చ జరుగుతోంది.

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ, ఏ5 వి.విజయసాయిరెడ్డి పాత్రపై తొలి రోజుల్లో విపరీతమైన ఆరోపణలు వచ్చినట్లు అంతా గుర్తు చేస్తున్నారు. అయితే లిక్కర్ స్కాంలో తనకు సంబంధం లేదని, ఈ విషయంలో కర్త, కర్మ, క్రియ అంతా ఏ1 కేసిరెడ్డి రాజ్ రెడ్డిదని విజయసాయి వెల్లడించారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే కేసిరెడ్డి అరెస్టు జరిగిందని అంటుంటారు. అంతేకాకుండా లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం మొదలైన తర్వాత విజయసాయిరెడ్డిని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు సహకరిస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆయన అరెస్టు ముప్పు నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఆయన సహకారంతోనే లిక్కర్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయని చెబుతున్నారు. దీంతోనే నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి సాక్షి హోదాలో కూడా నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

ఇక స్కాంలో ప్రధానమైన పాత్ర పోషించారని అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను సిట్ ఏ2గా గుర్తించింది. ఈయనను కూడా ఇంతవరకు లిక్కర్ స్కాంలో అరెస్టు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి రికార్డులు మాయం చేశారని వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కొన్నాళ్లు సస్పెన్షన్ విధించారు. కేంద్ర సర్వీసులకు చెందిన ఆయన బెయిలుపై విడుదలయ్యాక రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేశారు. ఇక వాసుదేవరెడ్డి ప్రభుత్వానికి లొంగిపోయారని, లిక్కర్ స్కాంలో ఆయనను బెదిరించి ప్రభుత్వం తనకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయనను అరెస్టు చేయకుండా, ఆయన నోటి మాటే ఆధారంగా తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది.

చివరగా, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ విషయంలోనూ సిట్ మెతకగా వ్యవహరించడంపై చర్చ జరుగుతోంది. ఆయనకు ఐఏఎస్ హోదా కల్పిస్తామని చెప్పి వైసీపీ నేతలు స్కాంకు పాల్పడ్డారని సిట్ ఆరోపిస్తోంది. దీంతో సత్యప్రసాద్ ను ఏ3గా గుర్తించింది. తొలుత సత్యప్రసాద్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిట్ పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది. కానీ, ఆయనను ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈయన కూడా అప్రూవర్ గా మారిపోయారా? అని వైసీపీ అనుమానిస్తోంది. దీంతో స్కాంలో ప్రధాన పాత్రధారులుగా అనుమానిస్తున్న ముగ్గురి విషయంలో సిట్ వైఖరిపై చర్చ జరుగుతోంది.