రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఎటువైపు ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయా లేక కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తింది.
ANDHRAPRADESH:రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఎటువైపు ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయా లేక కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తింది. దీనికి ప్రధాన కారణం వైసిపి సానుభూతిపరుడుగా ఉన్న ఉద్యోగ సంఘం నాయకుడు తాజాగా పోలీసులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 'రేపు ప్రభుత్వం మారితే మీ సంగతి ఏంటో చూసుకోండి' అని ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. సరే ఆయనంటే వైసిపి అనుకూలం. అనుకూల ఉద్యోగి సంఘం నేత.
కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా భావించినా.. భావించకపోయినా ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు ఉద్యోగ సంఘం నాయకులు సదరు ఉద్యోగి చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం కనీసం ప్రభుత్వం తరఫున వారు నోరు మెదపకపోవడం వంటివి మాత్రం ప్రశ్నగా మారాయి. దీనిని కీలకంగా చర్చించాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులు పట్టుపెట్టి వైసిపి కి వ్యతిరేకంగా ప్రచారం చేశారనేది వాస్తవం. ఆనాడు ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులు గంటకోసారి మీడియా ముందుకు వచ్చి వైసిపికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.
తమకు అన్ని విధాల అన్యాయం చేశారంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. ఇలా కోరి కోరి వారు కూటమి ప్రభుత్వాన్ని గెలిచేలా సహాయం చేశారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏడాది తిరిగేసరికి వారు కూటమి ప్రభుత్వంపై మౌనంగా ఉన్నారు. ఒకరిద్దరైతే చూచాయిగా విమర్శలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి జేఏసీ నాయకులైతే తమకు కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుందని అంటున్నారు. ఇక ఇతర సంఘాల నాయకులు కొంత మౌనంగా ఉన్నారు.
అసలు కూటమి ప్రభుత్వాన్ని కోరి కోరి తెచ్చుకున్న వారు ఎందుకు ఇలాంటి విమర్శలను సహిస్తున్నారు. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది మాత్రం రాజకీయంగా చర్చకు వస్తోంది. దీనిని ప్రభుత్వం ఇప్పుడే సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉద్యోగులకు ఏవైనా బకాయిలు ఉంటే ఇవ్వటంతో పాటు వారిని సంతృప్తిపరిచేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అడుగులు వేస్తే ఈ పెరుగుతున్న అసంతృప్తి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్నికల సమయానికి ఉద్యోగులు సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంటాయి.
వాస్తవానికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రభుత్వం తరఫున ఉద్యోగులతో చర్చలు జరిపింది గాని సమావేశాలు అయింది కానీ లేదు. ఇది కూడా ఉద్యోగుల్లో కొంత అసంతృప్తిని రగిలిస్తోంది. ఇలా చూస్తూ ఊరుకుని గతంలో వైసిపి చాలా నష్టపోయింది. ఎంతో చేశామని వైసిపి చెబుతున్నా ఉద్యోగుల మనసును ఆకట్టుకోవడంలో వారిని తమ వైపు తిప్పుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆది నుంచే కూటమి ప్రభుత్వం ఉద్యోగుల వైపు నిలబడి వారి సమస్యలను పరిష్కరించడమా లేకపోతే మధ్య మార్గంగా మరో విధానాలను సూచించాలి. తద్వారా వారిని సానుకూలంగా మలుచుకోవడం అనే విషయంలో ముందడుగు వేయాలి.
Social Plugin