Ticker

6/recent/ticker-posts

సెల్ ఫోన్ చేతపట్టిన చంద్రబాబు... ఈసారి ఏమి చేశారంటే..!


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ పట్టుకుని కనిపించడం అత్యంత అరుదైన విషయం అనే చెప్పాలి.

ANDHRAPRADESH:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ పట్టుకుని కనిపించడం అత్యంత అరుదైన విషయం అనే చెప్పాలి. అలాంటిది ఈ మధ్యకాలంలో అలాంటి అరుదైన ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హెలీకాప్టర్ లో సెల్ ఫోన్ చేతపట్టి ఆయన పలు ఫోటోలు, వీడియోలు తీశారు. ఇప్పుడు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా గతంలో తీసిన సెల్ఫీలు చర్చకు వస్తున్నాయి.

అవును... ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగెళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "చూడు జగన్ ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు. టీడీపీ హయాంలో నిర్మించిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం" అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టులు చేశారు!

ఇదే సమయలో... "ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎన్ని? నువ్వు కట్టిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?" అంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తన మొబైల్ ఫోన్ తో నెల్లూరులోని టిడ్కో గృహ సముదాయం వద్ద స్వయంగా సెల్ఫీ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాడు సవాల్ కోసం అలా ఫోన్ చేతబట్టిన చంద్రబాబు.. ఇప్పుడు సంతృప్తిగా ఫోటోలు తీశారు!

ఇందులో భాగంగా... శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మంగళవారం కృష్ణమ్మకు పూజలు చేసి సారె సమర్పించి నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. అనంతరం సున్నిపెంటలోని ప్రాజెక్టు ఉన్నత పాఠశాల మైదానంలో ‘జలహారతి’ పేరిట నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ విషయాలను ఎక్స్ వేదికగా వెళ్లడించిన ఆయన.. చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు!

ఈ సందర్భంగా... జులై తొలివారంలోనే శ్రీశైలం నిండటం శుభపరిణామమని.. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చానని.. రాయలసీమ రతనాల సీమ కావాలని, రాష్ట్రం సుభిక్షం కావాలని శ్రీశైల మల్లన్నను ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు. సమర్థ నీటి నిర్వహణతో సాగునీటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నంలో అందరి సహకారం కోరినట్లు వెల్లడించారు.

ఇదే విషయాన్ని ఏపీ సమాచార పౌరసంభందాల శాఖ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు... హెలికాప్టర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ను, నదీ ప్రవాహాలను, పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.