Ticker

6/recent/ticker-posts

పవన్ ప్లస్ మాధవ్..కూటమిలో కొత్త బంధం!


ANDHRAPRADESH:జనసేన అటు టీడీపీకి ఇటు బీజేపీకి కావాల్సిన పార్టీ. ఆ మాటకు వస్తే ఏపీలో కూటమిని కుదురిందే జనసేన అని చెప్పాల్సి ఉంటుంది.

జనసేన అటు టీడీపీకి ఇటు బీజేపీకి కావాల్సిన పార్టీ. ఆ మాటకు వస్తే ఏపీలో కూటమిని కుదురిందే జనసేన అని చెప్పాల్సి ఉంటుంది. కూటమి రెండు చక్రాలూ టీడీపీ బీజేపీ అయితే ఇరుసుగా ఇంధనంగా జనసేన ఉంది. అలా కూటమి బండి జోరు చేయడానికి తన సర్వ శక్తులూ పవన్ పెట్టారని కూడా చెబుతారు.

ఇదిలా ఉంటే ఏపీలో కూటమిలో మూడు పార్టీలూ ఉన్నా ఎపుడూ చంద్రబాబు పవన్ మాత్రమే కనిపిస్తూ వస్తున్నారు. ఏ విషయం మీద అయినా ఈ ఇద్దరే కూర్చుని చర్చిస్తూ ఉంటారు అన్నది ప్రచారంలో ఉంది. ఇక బీజేపీ నుంచి పురంధేశ్వరి ఉన్నా చాలా సార్లు ఆమె ప్రెజెన్స్ అయితే కనిపించడంలేదని చర్చ కూడా ఉండేది.

అయితే ఇపుడు ఏపీ బీజేపీలో కొత్త సారధిగా పీవీఎన్ మాధవ్ వచ్చారు. ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, అన్నింటికీ మించి ఒరిజినల్ బీజేపీ లీడర్. ఆయనకు బీజేపీ పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందరి వాడుగా పేరుంది. ఏపీ బీజేపీని అభివృద్ధి చేద్దామన్న తపన కూడా ఉంది.

దాంతో మాధవ్ కి నాయకత్వం అప్పగించడానికి ఇవే కారణాలు అని అంటున్నారు. ఇక కూటమిలో అయినా ఏపీలో అయినా రాజకీయాలను మార్చడానికి గేమ్ చేంజర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ జనసేన అని ఠక్కున చెబుతారు.

ఆయన కీ రోల్ అలా ప్లే చేస్తున్నారు. అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం పవన్ కి ఎంతో విలువ ఇస్తుంది. మోడీ ఏపీకి వస్తే చాలు పవన్ తోనే ఎంతో అభిమానంగా ఉంటారు. అయితే మోడీ తరువాత ఏపీలో అలా పవన్ చేయిని పట్టుకుని ఏపీలో బీజేపీతో గట్టిగా కలిపి ముందుకు తీసుకుని వెళ్ళే పరిస్థితి అయితే లేదు.

కానీ ఇపుడు ఆ లోటు తీరింది అని అంటున్నారు. మాధవ్ కి పవన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే పవన్ కూడా మాధవ్ పట్ల ఎంతో సుముఖంగా ఉంటున్నారు. మాధవ్ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కాగానే పవన్ ఆయను ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఆయన నాయకత్వంలో బీజేపీ ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన మరుసటి రోజే మాధవ్ కూడా పవన్ కి నిజమైన మిత్రుడిగా నిలబడ్డారు. తమిళనాడు ప్రభుత్వం పవన్ మీద క్రిమినల్ కేసులు పెట్టింది. ఆయన మురుగన్ సమావేశంలో పాల్గొన్నారు నిబంధనలు ఉల్లఘించారు అన్న దాని మీద కేసులు పెట్టింది. దాని మీద మాధవ్ గట్టిగా ఖండించారు. డీఎంకే మీద విమర్శలు చేశారు.

పవన్ పై కేసుని మురుగన్ మీద దాడిగా భావిస్తామని డీఎంకే సర్కార్ ని హెచ్చరించారు. అంతే కాదు తమిళనాడులో దుర్మార్గపు పాలన సాగుతోంది అని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి పవన్ కి అండగా తాము ఉంటామని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు.

మొత్తానికి మాధవ్ బీజేపీ అధ్యక్షుడు అయిన వెంటనే పవన్ కి అండగా ఉంటామని భారీ ప్రకటన చేశారు. మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ పెద్దన్నగా కూటమిలో ఉంది. మిత్రులుగా ఉన్న జనసేన బీజేపీల మధ్య మరింత సఖ్యతను సాధించేందుకు కూడా కొత్త అధ్యక్షుడు కృషి చేస్తారు అని అంటున్నారు. తద్వారా ఏపీలో కూటమిలో సరికొత్త సమీకరణలకు ఏమైనా నాంది ప్రస్తావన జరుగుతుందా అన్నది చర్చగా ఉంది.

కూటమి అంటే మూడు పార్టీలని అందరికీ సమానంగానే అవకాశాలు ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కానీ మాధవ్ పవన్ కి అండగా ఉంటున్న వైనం కానీ చూస్తే ఇక మీదట మోడీ తరహాలో పవన్ తో చేయి కలిపి ముందుకు నడిచే బీజేపీ మిత్రుడు ఏపీలోనూ ఉంటారని అంటున్నారు తద్వారా కూటమిలో సైతం రాజకీయ బలాలు కూడా మారుతాయని అంటున్నారు.