Ticker

6/recent/ticker-posts

కేతిరెడ్డికి మళ్లీ నిరాశే..! తాడిపత్రికి నో ఎంట్రీ..! హైకోర్టు కంటే జేసీ ఆదేశాలకే..!


ANDHRAPRADESH:ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో సై అంటే సై అనేలా రాజకీయాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అధికారం కోల్పోయిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో 2019 కంటే ముందు విపక్షంలో ఉండి మరీ తాడిపత్రిలో రాజకీయాలు మొదలుపెట్టిన పెద్దారెడ్డికి ఇప్పుడు మరోసారి అదే విపక్షంలో ఉండి అడుగు కూడా పెట్టలేని పరిస్ధితి ఎదురవుతోంది. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా పోలీసులు సహరించకపోవడంతో పెద్దారెడ్డి మరోసారి టూర్ వాయిదా వేసుకున్నారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా సాగుతున్న తాడిపత్రి రాజకీయంలో అధికారంలో ఎవరుంటే వారికి సహకరిస్తున్న పోలీసులు మరోసారి అదే వైఖరి కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల కంటే అధికారంలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలనే పాటిస్తూ పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. శాంతిభద్రతల కారణాలు చూపుతూ పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్నారు.

తాజాగా మరోసారి వైసీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నించిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సహకరించలేదు. ప్రతిసారీ హైకోర్టు ఆదేశాలను చూపుతూ తాడిపత్రిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పెద్దారెడ్డికి శాంతి భద్రతల పేరుతో పోలీసులు సహకరించేందుకు వెనకాడుతున్నారు. దీంతో కేతిరెడ్డిని టూర్ వాయిదా వేసుకోవాలని కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి మరోసారి తన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

దీనికి బదులుగా ఈ నెల 18న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా వైసీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు రావొచ్చంటూ పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల వినతిని పెద్దారెడ్డి కూడా అంగీకరించి తన టూర్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే ఇలా ఎంతకాలం అన్న దానికి మాత్రం పోలీసుల వద్ద సమాధానం లేదు. ఈ నెల 18న పెద్దారెడ్డి వస్తే అప్పుడైనా ఎంట్రీ దొరుకుదంటే గ్యారంటీ లేదు. దీంతో పెద్దారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తారా లేక పోలీసులతో ఇలా చర్చించుకుంటూ తాడిపత్రిక దూరంగా ఉండిపోతారా అన్నది తేలడం లేదు.