విజయవాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.
VIJAYAWADA:ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో జరగకపోయినా.. జరుగుతున్న చోట ప్రజల నుంచి నాయకులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా గుంటూరు, విజయవాడలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీలు.. పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వారికి ఒకింత సెగతగిలిందనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రజలు గతంలో మాదిరిగా సర్దుకుపోయే టైపులో లేరు. తమకు ఏ చిన్న సమస్య వచ్చినా బహిరంగంగానే చెబుతున్నారు.
విజయవాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, తల్లికివందనం, ఉచిత గ్యాసు.. వంటివాటి ని ఆయన వివరించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా లభిస్తుందన్నారు. ఇలా ఇంటింటికీ వెళ్లినప్పుడు నాలుగు చోట్ల ఎంపీకి ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని.. గతంలో ఇంత లేవని.. చెబుతున్నారు.
వినియోగిస్తున్నది రూ.500 కరెంటైతే.. బిల్లు మాత్రం 1700 వస్తోందన్నది మహిళలు చెబుతున్న మాట. దీనికి సంబంధించి ఎంపీని ప్రశ్నలతో ముంచెత్తారు. కానీ, ఆయన తెలివిగా.. ఈ తప్పు తమది కాదు.. ఆ పిచ్చోడిది! అంటూ.. జగన్‌పై నెట్టారు. సరే.. రాజకీయంగా ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు.కానీ.. ప్రజల నుంచి మరో విషయం వెలుగు చూసింది. అందుకే.. మీకు ఓటేశామని.. ఇంకా వైసీపీ పేరు చెబుతారా? అంటూ.. నిలదీశారు. దీంతో ఏదో సర్దిచెప్పిన ఎంపీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అచ్చంగా ఇలాంటిదే కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కూడా ఎదురైంది. అయితే.. ఆయన వైసీపీపై నెట్టకుండా.. త్వరలోనే తగ్గుతాయని.. ప్రస్తుతం విద్యుత్ కొరత ఉందని చెప్పుకొచ్చారు. ఎలా చూసుకున్నా.. ప్రజలు మాత్రం ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పథకాలు.. చేస్తున్న పనులను నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి.. సర్కారు.. జాగ్రత్తగా అడుగులు వేయాల్సి న అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.
Social Plugin