Ticker

6/recent/ticker-posts

వైసీపీ ఆరోపణలు నిజమే కానీ ఫేక్.. ? ఫ్యాక్ట్ చెక్ లో ప్రభుత్వం క్లారిటీ!



ANDHRAPRADESH:ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ లో భాగంగా ఇచ్చిన స్కూలు బ్యాగులు చిరిగిపోతున్నాయంటూ వస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. వైసీపీ తాజాగా చేసిన ఈ ఆరోపణలపై స్పందిస్తూ ఫ్యాక్ట్ చెక్ లో క్లారిటీ ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో స్కూలు బ్యాగుల్లో కొన్ని చిరిగిపోయిన విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. అయితే దీని వెనుక పలు కారణాలు ఉన్నాయని తెలిపింది.

రెండు రోజుల క్రితం వైసీపీ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఇందులో పబ్లిసిటీ కోసం క్వాలిటీ బ్యాగు.. స్కూల్ పిల్లలకేమో క్వాలిటీలెస్ బ్యాగులు అంటూ ఆరోపణలు చేసింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకి సర్కారు ఇవ్వబోయే బ్యాగు ఇదేనంటూ అసెంబ్లీకి తెచ్చి మరీ గొప్పగా బ్యాగ్‌ను చూపించిన నారా లోకేష్ అంటూ ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. కానీ.. బడులు తెరిచిన నెలలోపే చిరిగిపోయి మూలనపడిన బ్యాగులు, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న నారా లోకేష్ అంటూ విమర్శలు గుప్పించింది.

దీనికి స్పందనగా ప్రభుత్వం ఎక్స్ లోనే ఫ్యాక్ట్ చెక్ లో స్పందించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ పథకం కింద కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని, అప్పుడే అవి తెగిపోయాయని ... అలాగే భోజనం కూడా రుచిగా లేదంటూ... ఆలూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలోని విద్యార్థుల బ్యాగులు చూపిస్ ఒక మీడియా వారు కథనాలను ప్రసారం చేసారు. ఆ పాఠశాలలో మొత్తం 650 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఈ ప్రసారంలో కేవలం ఒక ఐదారుగురు విద్యార్థుల చేతుల్లో ఉన్న బ్యాగులను మాత్రమే చూపించడం జరిగిందని తెలిపింది.

అన్ని వందల మందిలో ఐదారుగురు అంటే అది వారి నిర్వహణ లోపం కావచ్చు లేదా ఇతరత్రా ఇంకేమైనా కారణాలు కావచ్చు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లేని సమయం చూసి ఆమెకు సమాచారం ఇవ్వకుండా, ఆమె అనుమతి తీసుకోకుండా మీడియా పాఠశాల లోకి వెళ్లడం తమకు అనుకూలంగా చిత్రీకరణ చేసుకోవడం వెనుక వారి ఉద్దేశ్యం ఏమిటో తెలుస్తూనే ఉందని పేర్కొంది. అసలు విషయానికి వస్తే... ప్రధానోపాధ్యాయురాలు మరియు మండల విద్యాశాఖాధికారుల వివరణ ప్రకారం... విద్యార్థులందరికీ నాణ్యమైన కిట్లనే ఇవ్వడం జరిగిందని వెల్లడించింది.

అలాగే మధ్యాహ్న భోజనంలో కూడా సన్నబియ్యం వినియోగిస్తున్నారని తెలిపింది. వంట సరకుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో, కొందరు పనిగట్టుకుని చేసే ఇటువంటి ఫేక్ ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్దని తెలిపింది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi