Ticker

6/recent/ticker-posts

విద్యా వ్యవస్థ పటిష్టం దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!


TELANGANA:తెలంగాణలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యా వ్యవస్థ పటిష్టం దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో విడతల వారీగా 571 కొత్త ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 157 కొత్త పాఠశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ సర్కారు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు.. ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల లేనట్లైతే వెంటనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మొదటి విడతలో గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాల అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రభుత్వ గృహాలలో లేదా అద్దె వసతి గృహాలలో పాఠశాలలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఫర్నీచర్, స్టేషనరీ, విద్యా సామగ్రి, ఇతర వస్తువులకు అవసరమైన బడ్జెట్‌ను డీఎస్ఈ ద్వారా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 212 గ్రామీణ ఆవాసాలలో, 359 పట్టణ కాలనీలు లేదా వార్డులలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 571 కొత్త ప్రైమరీ స్కూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి.. విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యమని గతంలో సీఎం రేవంత్ అన్నారు." తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను నిర్మించనున్నాం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నాం. విద్యా ప్రమాణాలను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామాలు, పట్టణాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నాం. విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంచాలి" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.