పార్టీ విషయాలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని మల్లు రవి హితవు
పదేళ్లు సీఎంగా ఉంటానని ఏ సందర్భంలో అన్నారో రాజగోపాల్ రెడ్డికి తెలియదని వ్యాఖ్య
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం
HYDERABAD:పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ నేతలు సంయమనం పాటించాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ముఖ్యమంత్రిపై పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన తెలిపారు. పార్టీకి సంబంధించిన విషయాలను బహిరంగంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ఏ సందర్భంలో అన్నారో రాజగోపాల్ రెడ్డికి తెలియదని ఆయన అన్నారు.
అదే సమయంలో కేటీఆర్‌పై మల్లు రవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కాగా, ముఖ్యమంత్రిగా మరో పదేళ్లు తానే ఉంటానని రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధివిధానాలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా మల్లు రవి ఈ విధంగా స్పందించారు.
Social Plugin