ANDHRAPRADESH:పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ టీవీ రామారావుపై వేటు పడింది. పార్టీ అగ్రనాయకత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు కన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చీఫ్ వేములపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యకలాపాలను నిర్వహించడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది జనసేన. ఇటువంటి కార్యకలాపాలు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.
కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించినట్లు జనసేన వెల్లడించింది. తుది నిర్ణయాలను తీసుకునేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని టీవీ రామారావును ఆదేశించింది. ఈ సస్పెన్షన్ వేటు వేయడానికి కారణాలు లేకపోలేదు.
కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఇటీవలే ఆందోళన నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ ఆందోళనను జనసేన అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయనపై క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసింది.
2009 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు టీవీ రామారావు. ఆ తరువాత ఎన్నికలకు దూరం అయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. 2023లో జనసేన పార్టీలో చేరారు. 2024లో కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ దక్కించుకుంది. నాటి ఎన్నికల్లో ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.
Social Plugin