ANDHRAPRADESH:ఏపీలో వైసీపీ హయాంలో అమల్లోకి తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఐదేళ్ల పాటు నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లలో సగం మందిని ఆ పార్టీ గత ఎన్నికల ముందు రాజీనామాలు చేయించేసింది. మిగతా సగం కొనసాగినా వారి సేవలు వాడుకునేందుకు కూటమి సర్కార్ ససేమిరా అనేసింది. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ముగిసిపోయినట్లయింది.
ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా వాలంటీర్ల గురించి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రస్తుతానికి ఒరిగేదేమీ లేకపోయినా భవిష్యత్తులో అధికారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చెప్పిన అంశాలు మాత్రం పార్టీ కార్యకర్తలకు ఊరటనిచ్చేలా ఉన్నాయి. ఇంతకీ తాను జగన్ కు ఏం ఫిర్యాదు చేశానో తాజాగా పార్టీ కార్యకర్తల భేటీలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలని, వాలంటీర్లు కాదని జగన్ కు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలకు, పాలకులకూ మధ్య వారధిగా కార్యకర్తలనే ఉంచాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందించామని, అదే కార్యకర్తల ద్వారా అందించే ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ వల్ల వైసీపీ చిన్నాభిన్నం అయ్యిందన్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ వాలంటీర్లను వదిలి కార్యకర్తలపైనే కేసులు పెడుతోందన్నారు. ఫైనల్ గా కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం వల్లే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందని జగన్ కు తెలిపారు.
Social Plugin