Ticker

6/recent/ticker-posts

గవర్నర్ గా అశోక్ ఇన్, ఆయన అవుట్ - మోదీ మార్క్ నిర్ణయం..!!


HYDERABAD:మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీకి గవర్నర్ పదవి కేటాయించారు. అదే విధంగా హర్యానాతో పాటుగా లడఖ్ కు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. కాగా.. ఈ నియామకాల్లో ఒక తెలుగు నేతకు గవర్నర్ పదవి రాగా. . ప్రస్తుతం గవర్నర్ గా కొనసాగుతున్న మరో తెలుగు నేత స్థానంలో కొత్త నియామకం జరిగింది. దీంతో, ఇప్పుడు ఆయనకు దక్కే పదవి పైన చర్చ మొదలైంది.

కేంద్రం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. అందులో భాగంగా మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి కేటాయించింది. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజును నియమించింది. హర్యానా గవర్నర్ ఆషిమ్ కుమార్ ఘోష్.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవీంద్ర గుప్తాను కేంద్రం నియమించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ.. పలు హోదాల్లో అశోక్ గజపతి రాజు పని చేసారు. అశోక్ గజపతి రాజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి ఎంపీగా పని చేసారు. ఎన్డీఆర్, చంద్రబాబు కేబినెట్ లో పలు కీలక శాఖలు నిర్వహించారు. 2014 లో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన నాడు మోదీ ప్రభుత్వం లో కేబినెట్ మంత్రి హోదాలో విమానయాన శాఖ నిర్వహించారు.

ఇక.. ఇదే సమయంలో మరో తెలుగు నేత బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ ను కొత్త గవర్నర్ గా నియమించారు. ఆరెస్సెస్ కార్యకర్తగా క్రియాశీలకంగా వ్యవహరించిన బండారు దత్తాత్రేయ బీజేపీ లో పలు హోదాల్లో పని చేసారు.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎంపీగా .. వాజ్ పేయ్, మోదీ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేసారు. కాగా, తొలుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ తరువాత 2021 లో హర్యానా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ముగియటంతో ఇప్పుడు అక్కడ కొత్త గవర్నర్ ను నియమించారు. దీంతో.. ఇప్పుడు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారా లేదా అనేది ఆసక్తి కర చర్చగా మారింది.