ANDHRAPRADESH:బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. అటు నాగార్జున సాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల కిందటే సాగర్ గేట్లను ఎత్తారు.
దీని ప్రభావం ప్రకాశం బ్యరేజీపై పడింది. ఇన్‌ఫ్లో భారీగా ఉంటోంది. దీనితో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను కొద్దిసేపటి కిందటే ఎత్తివేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తోన్నారు. కృష్ణానదికు వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటోన్న కొద్దీ వరద నీటి దిగువకు వదిలివేస్తోన్నారు.
15 గేట్లను రెండు అడుగుల మేరకు ఎత్తారు. మిగిలిన 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి వస్తోన్న వరద నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తోన్నారు. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులు. కాగా సముద్రంలోకి 60,875 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,207 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాలువకు 5527 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ కు 200 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు.
ఒకట్రెండు రోజుల్లో దాదాపుగా మూడు లక్షల క్యూసెక్కుల వరకు వరదనీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా నది మీద ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, ఘాట్ల వద్ద స్నానం చేయడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదని సూచించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తినందున కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
Social Plugin