Ticker

6/recent/ticker-posts

ఏపీలో జిల్లాలకు కొత్త పేర్లు- సరిహద్దులూ?


 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అన్ని జిల్లాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించడానికి రంగం సిద్ధం చేసింది. వాటికి కొత్త పేర్లు పెట్టనుంది. కొత్త సరిహద్దులనూ నిర్ధారించనుంది.


దీనికోసం- మంత్రుల బృందం ఏర్పాటైంది కూడా. అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, పొంగూరు నారాయణ- మున్సిపల్ పరిపాలన, వంగలపూడి అనిత- హోం, బీసీ జనార్ధన్ రెడ్డి- రోడ్లు భవనాలు, నిమ్మల రామానాయుడు- జల వనరులు, నాదెండ్ల మనోహర్- పౌర సరఫరాలు, సత్యకుమార్- వైద్య ఆరోగ్య శాఖ.. ఇందులో ఉన్నారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్.. జీవో విడుదల చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. ఈ బృందానికి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. మంత్రుల బృందం చేపట్టాల్సిన కార్యక్రమాలను జీవోలో పొందుపరిచారు. దీనికి గల మార్గదర్శకాలను నిర్ధారించారు. 

ఇప్పుడు మనుగడలో ఉన్న జిల్లాల పేర్ల మార్పుపై అధ్యయనం చేస్తుందీ మంత్రుల బృందం. ప్రాంతీయ పరిస్థితులు, అక్కడి చరిత్రకు అనగుణంగా కొత్త పేర్లు పెట్టే అవకాశాలను పరిశీలిస్తుంది. 

అదే సమయంలో- జిల్లా, రెవెన్యూ డివిజిల్ లేదా మండల సరిహద్దులపై అధ్యయనం చేస్తుంది. దీనితో పాటు జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రానికి ఆయా గ్రామాల మధ్య దూరాన్ని అంచనా వేస్తుంది. దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు.

ఈ క్రమంలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుంది. వీటన్నింటిని క్రోడీకరించిన అనంతరం సమగ్ర నివేదికను సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. మూడు నెలల్లోగా ఈ నివేదిక అందే అవకాశం ఉందని తెలుస్తోంది.