ANDRAPRADESH: ఏపీలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన వాటిలో "తల్లికి వందనం" ఒకటనే సంగతి తెలిసిందే. పేదరికం కారణంగా జీవితాలను మార్చే ఆయుధమైన చదువు ఏ పిల్లాడికీ దూరం కాకూడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ‘తల్లికి వందనం’ పథకానికి చెప్పినట్లుగానే రేపు నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరే నాటికి రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి అనే విషయాన్ని శ్వేత పత్రాల రూపంలో చంద్రబాబు ప్రకటించారు! పరిస్థితిని అర్ధం చేసుకోవాలని ప్రజలకు విన్నవించారు. ఇదే సమయంలో శాసనమండలిలో మాట్లాడిన మంత్రి లోకేష్... ఈ విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలుపై మాట ఇచ్చారు.
చెప్పినట్లుగానే సరిగ్గా జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా... తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనున్నారు. ఈ మేరకు ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం నేరవేరుస్తోంది. పైగా.. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రవేశపెట్టబడింది. గతంలో అమలు చేసిన 'అమ్మ ఒడి' పథకంతో పోలిస్తే, ఈ 'తల్లికి వందనం'లో కీలక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా వారందరికీ ఆర్థిక సహాయం అందుతుంది.
వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో రూ.2,000 పాఠశాల నిర్వహణకు కట్ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా రూ.15,000లను తల్లి ఖాతాలో జమ చేయనుంది! ఈ పథకం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. ఈ పథకం విధివిధానాల్లో మంత్రి లోకేష్ పాత్ర కీలకం అని తెలుస్తోంది! ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఈ ఆర్ధిక సాయం ఇచ్చేవారు. తెల్ల రేషన్ కార్డును తప్పనిసరి చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం అలాంటి కండిషన్స్, కోతలు ఏమీ లేకుండా... ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వనుంది. దీంతో.. ఈ పథకం అనేక మంది పిల్లలకు మేలు చేకూర్చనుంది.
ఈ సందర్భంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా 'తల్లికి వందనం' అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ సందర్భంగా.. తల్లులకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బడికి వెళ్లే పిల్లలందరికీ 'తల్లికి వందనం' అందుతుందని చెప్పిన లోకేష్.. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 అమలు చేశామని పేర్కొన్నారు. ఇదే సమయంలో... సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషమని చెప్పిన లోకేష్.. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అందుతుందని తెలిపారు. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుందని అన్నారు.
Social Plugin