Ticker

6/recent/ticker-posts

రాంచందర్‌రావు కు పగ్గాలు వెనుక - ఈటలకు పదవి అడ్డుకుందెవరు..!?


తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఖరారయ్యారు. అనూహ్యంగా రాంచందర్‌రావు ను పార్టీ అధ్యక్షడిగా ఎంపిక చేసారు. తొలి నుంచి పలువురు పేర్లు రేసులోకి వచ్చాయి. తెలంగాణలో పార్టీ భవిష్యత్ పైన అధినాయకత్వం భారీ అంచనాలతో ఉంది. ఈ సమయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. అదే సమయంలో రాంచందర్‌రావు ఎంపిక ద్వారా కొత్త సంకేతాలు ఇస్తోంది. అయితే, పార్టీ చీఫ్ గా ఈటల ఖాయమని ప్రచారం వేళ పార్టీ నిర్ణయం ఆసక్తి కరంగా మారింది. దీంతో, రాంచందర్‌రావు ఎంపిక వెనుక..ఈటల కు రాకపోవటం వెనుక కారణాలు ఏంటనేది ఇప్పుడు పార్టీలో చర్చకు కారణమవుతోంది.

రాంచందర్‌రావు కు బాధ్యతలు 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు ఖరారైంది. ఈ ఎంపిక వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు మద్దతు ప్రకటించారు. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే రాంచందర్‌రావు ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విద్యార్ధి దశ నుంచి ఏబీవీపీ, బీజేపీ యువ మోర్చా, పార్టీలో వివిధ హోదాల్లో రాంచందర్‌రావు పని చేసారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న అనేక సందర్భాల్లో రాంచందర్‌రావు మద్దతుగా నిలిచారు. పార్టీలోని అందరి నేతలతోనూ సత్సంబంధా లు కలిగిన నేతగా గుర్తింపు ఉంది.

బీసీ సమీకరణం 

మరోవైపు, పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ పేరు కూడా రాష్ట్ర అధ్యక్షుడి తుది జాబితాలో ఉంది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా, మరోవైపు జాతీయ స్థాయి సమీకరణాల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉంది. తాము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని పార్టీ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మరో సామాజిక వర్గం నేత ఉండాలన్న ఆలోచనలో భాగంగా పార్టీకి సుదీర్ఘ కాలం సేవలు అందిస్తున్న రాంచందర్‌రావు కు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా పార్టీని నమ్ముకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయనే సంకేతాలను పార్టీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అధ్యక్ష పదవి ఏకగ్రీవం కానుంది

ఈటలకు నో ఛాన్స్ఇ

క, బీసీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఈటల రాజేందర్ కు ఇస్తారని ప్రచారం సాగింది. ఒక దశలో ఈటల పేరు ఖాయమైనట్లు ఢిల్లీ సర్కిల్స్ లో వినబడింది. బండి సంజయ్ ను కేంద్ర మంత్రి చేయటంతో..ఈటల కు లైన్ క్లియర్ అయిందని భావించారు. కాగా, గతంలో సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ సమయంలో ఈటల ఢిల్లీకి ఫిర్యాదుల వ్యవహారం ఇప్పుడు ప్రభావం చూపినట్లు చర్చ జరుగుతోంది. పార్టీలోకి వచ్చిన వారి కంటే పార్టీనే నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయంగా చెబుతున్నారు. కాగా, తెలంగాణ బీజేపీ లో నడిచిన కోల్డ వార్.. ఢిల్లీ నివేదికలు.. ముఖ్య నేతల అభిప్రాయాలతో ఇప్పుడు కొత్త వివాదాలకు తావు లేకుండా రాంచందర్‌రావు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.