Ticker

6/recent/ticker-posts

జగన్ కు మాజీ వీర విధేయుడి అడ్డంకులు ? ప్రతీకారానికి ఛాన్స్ దొరికిందా ?

గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ కు దగ్గరయ్యేందుకు పార్టీలోని చాలా మంది నేతలు ప్రయత్నించారు. ముఖ్యంగా నమ్మిన వారి కోసం ఎందాకైనా వెళ్తారని పేరున్న వైఎస్ కుటుంబానికి ఓసారి దగ్గరయితే చాలు ఇక తమ భవిష్యత్తును వారే చూసుకుంటారన్న ఆశతో పలువురు నేతలు ఇలా ప్రయత్నాలు చేసేవారు. ఇదే క్రమంలో జగన్ కు బాగా దగ్గరైన ఓ నేత ఆ తర్వాత ఆయనపై అసంతృప్తితో పార్టీ మారి టీడీపీలోకి వెళ్లి తిరిగి ఇప్పుడు అదే జగన్ కు అడ్డంకులు కల్పిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయమే వేరు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కంటే తనకు ఓట్లేసిన జనానికి దగ్గరగా ఉంటూ రాజకీయాలు చేస్తారన్న పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. గత వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో తనకు వరుసకు బావ అయ్యే వైసీపీ కీలక నేత కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి రాజకీయాలు చేశారు. ఓ దశలో ఆయన్నూ వ్యతిరేకించారు. చివరికి వైసీపీకి గుడ్ బై చెప్పేసి సోదరుడు గిరిధర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి జంప్ అయిపోయారు. గత ఎన్నికల్లో కూటమి గాలిలో టీడీపీ ఎమ్మెల్యేగా అదే నెల్లూరు రూరల్ స్ధానం నుంచి గెలిచారు.

అయితే వైసీపీలో ఉన్న సమయంలో జగన్ తో అనుబంధం పెంచుకునేందుకు కోటంరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఏకంగా చంద్రబాబుపైనే తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ కంట్లో పడేందుకు ప్రయత్నించేవారు. ఓ దశలో ఓ విమర్శలు ఏ స్దాయికి వెళ్లిపోయాయంటే అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడేందుకు నిలబడితే చాలు కోటంరెడ్డి వెంటనే పోటీగా నిలబడి ఆయన్ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించే వారు. చివరికి వైసీపీ మంత్రులే ఆయన్ను అడ్డుకుని వెనక్కి తగ్గమని సూచించే దాకా ఇది వెళ్లింది. అయినా జగన్ దయ లేకపోవడంతో కోటంరెడ్డి చివరి నిమిషంవరకూ ప్రయత్నాలు చేసి ఇక చేసేది లేక వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్లిపోయారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తన మాజీ బాస్ జగన్ పై ప్రతీకారం తీర్చుకుందుకు అవకాశం లభించింది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతూ జైలు జీవితం గడువుతున్న వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ లో పరామర్శించేందుకు జూలై 3న జగన్ నెల్లూరుకు వస్తున్నారు. అయితే ప్రత్యేక హెలికాఫ్టర్ లో వస్తున్న జగన్ కోసం ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు కోసం ప్రైవేటు స్థలాల్ని వైసీపీ నేతలు వెతుకుతున్నారు. అయితే జగన్ హెలిప్యాడ్ కు స్థానికులు స్థలం ఇవ్వకుండా కోటంరెడ్డి ఒత్తిడి తెస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తద్వారా జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని కోటంరెడ్డి వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బాబు గుడ్ లుక్స్ లో పడతానని అంచనా వేసుకుంటున్నట్లు సమాచారం.