ఏలూరు: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన కొల్లేరు సరస్సు పరిసరాలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలపై సమీక్ష సమావేశం గురువారం ఏలూరు జిల్లాపరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ శ్రీమతి బి. విజయ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొల్లేరు సరస్సు పరిరక్షణకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వము చేపట్టిన చర్యలలో భాగంగా లిడార్ సర్వే (LiDAR Survey) కొనసాగుతోందని, ఈ సర్వే ద్వారా సరస్సు అసలు వాస్తవ పరిమితి, ఆక్రమణలు ఖచ్చితంగా గుర్తించబడతాయన్నారు. సమావేశంలో చైర్‌పర్సన్ మాట్లాడుతూ "కొల్లేరు సరస్సు మన రాష్ట్రానికి పర్యావరణంగా, జలసంరక్షణ పరంగా ఎంతో ముఖ్యమైనదని, ఆక్రమణల వల్ల ఈ సరస్సు వైవిధ్యం కోల్పోతోందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేపట్టిన లిడార్ సర్వే ఆధారంగా అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు వేగవంతం చేయాలి" అని పేర్కొన్నారు.
అటవీశాఖ అధికారులు, ఇరిగేషన్, డ్రైనేజి శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. అక్రమ చేపల చెరువులు, మట్టి పూడికలు తొలగింపునకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొల్లేరులో 67 మినీ డ్రైన్ చానల్స్ ఉన్నాయని, ముంపు బారిన పడకుండా వాటి పూడికతీత పనుల ప్రతిపాదనలు తయారు చేసి అటవీశాఖ ద్వారా ప్రభుత్వ అనుమతి కొరకు పంపవలసినదిగా తెలియజేశారు.
సదరు ప్రతిపాదనలు తయరు చేసిన పిదప రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామా నాయుడు సహకారంతో ప్రభుత్వ అనుమతి పొందేలా కృషి చేస్తాం అని ఛైర్పర్సన్ తెలియజేశారు. అక్రమ నిర్మాణాలపై నిరంతర నిఘా, తక్షణ నివేదికల సమర్పణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను చైర్‌పర్సన్ ఆదేశించారు.