Ticker

6/recent/ticker-posts

ఏపీ మంత్రి సతీమణి తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్..


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన రోజు నుంచి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆడంబరాలకు దూరంగా ఉండాలని పదే, పదే చెబుతున్నారు. అయినా సరే కొందరు మాత్రం తీరు మార్చుకోవడం లేదు.. తాజాగా ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసుల విషయంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయ్యింది. ఆ ఘటన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లగా.. చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎవరైనా సరే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో మాట్లాడిన విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు. ఆ వెంటనే మంత్రితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరారు.. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగుల విషయంలో గౌరవంగా ఉండాలని సూచించారు. మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.. ఇలాంటి వైఖరిని సహించేది లేదన్నారు. ఆ ఘటనపై మంత్రి విచారణ వ్యక్తం చేశారు.. మరోసారి ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రికి చెప్పారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు.

అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం నుంచి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి విశాఖపట్నంలోని కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో.. ఆయన బదులు సతీమణి హరితారెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని భావించారు. హరితారెడ్డి చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్ల చూడాలని, తన వాహనానికి ఎస్కార్ట్‌గా రావాలని స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చారు. కానీ ఎస్సై కాస్త ఆలస్యంగా రావడంతో.. మంత్రి సతీమణి ఏక వచనంతో పరుషంగా మాట్లాడారు. ఎస్సైతో మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో మంత్రి సతీమణి, ఎస్సై మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.. ‘తెల్లారిందా? మేం ఏ టైమ్‌కి చేరుకున్నామో తెలుసా?’ అంటూ మంత్రి సతీమణి హరితారెడ్డి అన్నారు. కాన్ఫరెన్స్‌ ఉందని, అందుకే ఆలస్యమైందని ఎస్సై చెప్పగా.. ‘ఏం కాన్ఫరెన్స్‌... సీఐకి లేని కాన్ఫరెన్స్‌ నీకుందా? పెళ్లికొచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని తెలీదా?’ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పొరపాటైందని, ఎస్సై సారీ చెబుతుంటే.. ‘దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా మీకు జీతమిస్తోంది? వైఎస్సార్‌సీపీ వాళ్లు ఏమైనా ఇస్తున్నారా? డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నానా? మీ కోసం అర్ధగంట నుంచి నిరీక్షిస్తున్నాం.. పదండి.. కాన్వాయ్‌ స్టార్ట్‌ చేయండి’ అంటూ మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంత్రి సతీమణి తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.