Ticker

6/recent/ticker-posts

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు మరో చావుదెబ్బ.. పోలీసుల కాల్పుల్లో 11 మంది మృతి


ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్ట్‌లను భద్రతా బలగాలు చావుదెబ్బ తీశాయి. నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. కుర్రేవాయ్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 1,400 భద్రతా సిబ్బందితో దండాకారణ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్- మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఘమండి, కుర్రేవాయ్ గ్రామాల మధ్య మావోయిస్ట్‌లు, భద్రతా బలగాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.


నాలుగు జిల్లాల నుంచి 1400 మందికి పైగా సైనికులు అబుజ్మద్‌లోకి ప్రవేశించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ వెల్లడించారు. జవాన్లకు ఒక గీత కూడా పడలేదని, మావోయిస్టులకు భారీ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. కుహక్‌మెట్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. జూన్ 30న బయలుదేరిన ఈ ఉమ్మడి బృందానికి రెండు రోజుల తర్వాత నారాయణపూర్ జిల్లా మాద్ కోహ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్మడి అంతర్ జిల్లాల మధ్య మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో నక్సల్‌పై భద్రతా కాల్పులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో భద్రతా బలగాలకు ఎటువంటి నష్టం జరగలేదని, వారంతా సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక, DRG STF, BSF, ITBP బలగాలు, అంతర్ జిల్లాల సంయుక్త ఆపరేషన్‌లో అడపాదడపా కొనసాగుతున్నాయి.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ జరిగిన వరుస ఎన్‌కౌంటర్‌లలో దాదాపు 100 మంది వరకూ మావోయిస్ట్‌లు మృతిచెందారు. సార్వత్రిక ఎన్నికలు సమయంలో రాజకీయ వర్గాలను టార్గెట్ చేసుకుని నక్సల్స్ చర్యలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టాయి. దీంతో దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతోన్న వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్ట్ కీలక నేతలను ఒక్కొక్కరిగా భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి.

మావోయిస్ట్‌లు తమకు ఎంతో సురక్షితమని భావించిన దండకారణ్యంలో ఇప్పుడు వారి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఆధునిక సాంకేతకత, అత్యాధునిక ఆయుధాలతో మావోయిస్ట్ కోటలోకి భద్రతా బలగాలు చొచ్చుకుపోతున్నాయి. దీంతో నక్సల్స్‌ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.