Ticker

6/recent/ticker-posts

‘మర్యాదలు’ చేసిన పోలీసాఫీసర్ ఇంటికి టీడీపీ నేత..


Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సొంతంగా 135 సీట్లు రావడంతో ఆ పార్టీ నేతల్లో.. సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ విపక్షంలో ఉన్న సమయంలో కొమ్మారెడ్డి పట్టాభి.. వైసీపీ విధానాలను పెద్దఎత్తున ఎండగట్టారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదై.. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అక్రమ కేసులు బనాయించి తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి పలుమార్లు తన ఆవేదనను వ్యక్తం చేశారు.


ఇక ఎన్నికల్లో టీడీపీ గెలవటంతో జాషువాను కలిసేందుకు వెళ్లారు పట్టాభిరామ్. అయితే ఆయన అక్కడ లేకపోవటంతో కుర్చీలో పుష్పగుచ్ఛాన్ని, శాలువాను ఉంచి ఏం చెప్పాలనుకున్నది వీడియో తీసి ఎస్పీ జాషువాకు పంపించారు. ఆ తర్వాత మాట్లాడిన పట్టాభి అసలు తాను అక్కడికి ఎందుకు వచ్చిందీ చెప్పుకొచ్చారు.

" అప్పట్లో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి మర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చా. గతేడాది కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఒక అక్రమకేసులో జాషువాగారు నాకు చాలా గొప్పగా మర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంట్ ఆఫ్ చేసి మరీ మర్యాద చేశారు. ఆ రాచమర్యాదలను మర్చిపోలేను. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేద్దామని వచ్చా. అయితే దురదృష్టం ఆయన ఊర్లో లేరు. ఒకసారి నాకు అవకాశం ఇస్తే బొకే ఇచ్చి, శాలువా కప్పుతాను" అని పట్టాభి చెప్పుకొచ్చారు.

" మీరు ఒకసారి అవకాశం ఇస్తే.. మీ అంత మర్యాదలు మేము చేయలేకపోవచ్చు. చాలా చిన్నవాళ్లం. కానీ ఈ ప్రభుత్వంలో మీలాంటి అధికారులకు ఎలాంటి మర్యాదలు చేయాలో అలాంటి మర్యాదలు దక్కుతాయి. కావున ఒకసారి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నా.. నాకు ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే.. నేను జీవితంలో మర్చిపోకుండా మీరు చేసిన సత్కారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా".. అని పట్టాభి సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను అరెస్ట్ చేసినప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జాషువా మీద ఆరోపణలు చేసిన పట్టాభి.. అందుకు బదులు తీర్చుకుంటానన్నట్లుగా పరోక్షంగా ఇలా వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.