Ticker

6/recent/ticker-posts

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పర్యావరణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్


 ఏలూరు, నవంబర్ 6: లంచం తీసుకుంటూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ. శ్రీరామచంద్రమూర్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ వి. కృష్ణారావు వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోడౌన్ నిర్మాణానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) మంజూరు చేసేందుకు అధికారి లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు.

ఏలూరుకు చెందిన మత్తే బాబీ అనే వ్యక్తి తిమ్మాపురం గ్రామంలో గోడౌన్ నిర్మించుకునేందుకు అవసరమైన అనుమతుల కోసం సంబంధిత అధికారిని సంప్రదించారు. ఈ సందర్భంగా ఎన్‌ఓసీ మంజూరు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ. శ్రీరామచంద్రమూర్తి మొత్తం రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. చివరకు రూ.30 వేల చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఫిర్యాదుదారుడు ఏలూరులోని సంబంధిత కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు రూ.30 వేల నగదు అందజేస్తుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా నగదును స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ వి. కృష్ణారావు వెల్లడించారు.