ఏలూరు, నవంబర్ 06: తెలంగాణ నుంచి పెద్దవాగుకు భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బుధవారం సాయంత్రం ఏలూరులోని తన కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్‌తో పాటు సంబంధిత మండల తహసీల్దార్లతో ఎంపీ ఫోన్లో మాట్లాడారు. పెద్దవాగు వరద పరిస్థితి, ముంపు గ్రామాల్లో చేపట్టిన ముందస్తు చర్యలు, ప్రజల భద్రతకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసి ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ముఖ్యంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. వరద బాధితులకు తక్షణమే ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా చురుగ్గా పాల్గొనాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కుక్కునూరు, వేలేరుపాడు మండల పార్టీ అధ్యక్షులతో కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయా మండలాల్లో నెలకొన్న వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సహాయం అవసరమైనా తనను నేరుగా సంప్రదించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయం ద్వారా కూడా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అత్యవసర సహాయం కోసం 95152 25125, 98855 19299 నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.

