AMARAVATHI: ప్రజలకు సేవచేసేందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీకి సేవ చేసే అస్మదీయులకు భారీగా ప్రయోజనం కలిగిందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వంలో మరో స్కాం వెలుగులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం అని అంటున్నారు . ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అనేక కుంభకోణాలను తవ్వితీయగా, తాజాగా వలంటీర్లకు శిక్షణ పేరిట కూడా స్కాం చేశారని కథనాలు ప్రచురితమవుతున్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం అత్యంత గొప్పగా చెప్పుకున్న వలంటీర్లు ప్రజలకు ఏ మేర మేలు చేశారో గానీ వైసీపీ నేతలకు మాత్రం భారీగా లబ్ధి చేకూర్చారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా బయటపడిన ఈ అక్రమ చెల్లింపుల విషయమై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
ప్రజలకు సేవచేసేందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీకి సేవ చేసే అస్మదీయులకు భారీగా ప్రయోజనం కలిగిందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనంపై పనిచేసే వలంటీర్లకు న్యూస్ పేపర్ల కోసం రూ.200 చెల్లించడంపైనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లు వలంటీర్లకు శిక్షణ నిమిత్తం నాలుగేళ్లలో రూ.272 కోట్లు చెల్లించడం సంచలనం సృష్టిస్తోంది.
50 ఇళ్లకు ఓ వలంటీర్ చొప్పున గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది వలంటీర్ల సేవలను వినియోగించుకున్న విషయం తెలిసిందే. కేవలం పదో తరగతి చదువుకున్న వారిని వలంటీర్లుగా తీసుకుని వారి పరిధిలోని 50 ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించడం, పథకాలు పంపిణీ చేయడం, పెన్షన్ ఇవ్వడం వంటి పనులు చేయించేవారు. అయితే వారు సమర్థంగా పనిచేయడానికి ఏటా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించి రామ్ ఇన్ఫో అనే సంస్థను ఎంపిక చేశారు. ఏడాదికి రూ.68.62 కోట్లు చొప్పున నాలుగేళ్లకు సుమారు రూ.272 కోట్లు చెల్లించారు. కూటమి ప్రభుత్వం తాజాగా ఈ చెల్లింపులపై ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
వలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసిన రామ్ ఇన్ ఫ్రా గత నాలుగేళ్లలో ఎక్కడా అలాంటి కార్యక్రమం చేపట్టలేదని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. శిక్షణ పేరిట ఆ నిధులను దారి మళ్లించి ఐ ప్యాక్ సిబ్బందికి అందజేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి వ్యూహాలు అందజేసే ఐ ప్యాక్ ఆ పార్టీ కార్యకర్తలకు సాంకేతిక శిక్షణ, రాజకీయ తరగతులు నిర్వహించేది. దీనికి డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వ నిధులను వాడుకున్నారని ప్రభుత్వం సందేహిస్తోంది.
దీంతో వలంటీర్ల పేరిట కూడా స్కాం చేశారని టీడీపీ మండిపడుతోంది. ప్రభుత్వం తక్షణం ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తాజా స్కాంపై వైసీపీలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. వరుస స్కాంల్లో పార్టీ నేతలు చిక్కుకోవడం ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తుందని అంటున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీలో అక్రమాలు, మద్యం స్కాం ఇలా రకరకాల కేసుల్లో అరెస్టులతో హడలెత్తిస్తున్న ప్రభుత్వం వలంటీర్ల శిక్షణ పేరిట దారిమళ్లిన నిధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
Social Plugin