Ticker

6/recent/ticker-posts

పెద్దవాగుకు వరద ముప్పు.. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశం


 ఏలూరు, నవంబర్ 4: తెలంగాణ నుంచి వేలేరుపాడు మండలంలోని పెద్దవాగుకు భారీగా వరదనీరు చేరుతున్న నేపథ్యంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మురసు తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె సమీక్షించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

పెద్దవాగు వరదల కారణంగా వేలేరుపాడు, కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపుచీరాల, పాతపుచీరాల, అల్లూరినగర్, సొండిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి తదితర గ్రామాలకు ముంపు ప్రమాదం ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలను అత్యవసరంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని, ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రాధాన్యతనిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బోట్లు సిద్ధం చేయాలని, కల్వర్టులు, వాగులు, కాజ్‌వేల వద్ద ప్రమాద హెచ్చరికలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు సాగించకుండా సిబ్బందిని నియమించి అప్రమత్తం చేయాలన్నారు. నదులు, చెరువులు, కాలువల్లోకి ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రహదారి మార్గాలు దెబ్బతిన్న గ్రామాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల, గ్రామస్థాయి అధికారులు సహాయక చర్యలపై, ప్రజల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.