ఏలూరు/ఉంగుటూరు, నవంబర్ 4: జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పటిష్టంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రాన్ని ఆమె పరిశీలించి, పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 27 జెడ్పీటీసీ, 454 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్, 7వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 12,96,515 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, పోలింగ్ నిర్వహణ కోసం 1,555 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 2,444 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నట్లు వెల్లడించారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఓటర్ల సంఖ్యను బట్టి ఒకరి నుంచి ముగ్గురు వరకు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని వివరించారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చామని, పోలింగ్ పరికరాలతో పాటు వారిని వాహనాల్లో కేంద్రాలకు పంపించనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనంలో రూట్ అధికారిని కూడా నియమించనున్నట్లు చెప్పారు.
నవంబర్ 5వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల ప్రత్యేక అధికారి రామ్మోహన్, తహసీల్దార్ సన్యాసిరావు, ఎంపీడీఓ రాజ్ మనోజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

