ANDRAPRADESH, VIJAYAWADA, JUL, 08: టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ తనిఖీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగడంతో స్థానికంగా కలకలం రేగింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి ఎన్‌ఐఏ అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వించిపేట, భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నిందితులకు చెందిన ఇళ్లతో పాటు వారికి సంబంధించిన ఇతర ప్రదేశాలను కూడా అధికారులు తనిఖీ చేశారు.
టెర్రర్ లింక్స్ కేసులో ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సుహైల్ బెగ్, మహమ్మద్ రహంతుల్లాను అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసు అనంతరం దర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేయడంతో విచారణ మరింత వేగం అందుకుంది. అరెస్టైన ముగ్గురు నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? వారి నెట్‌వర్క్ ఎంత వరకు విస్తరించింది? అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వారి నివాసాల్లో మరోసారి సోదాలు నిర్వహించి పలు ఆధారాలను సేకరిస్తున్నారు. టెర్రర్ లింక్స్‌కు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు, స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

