Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా అటవీ శాఖాధికారి


ఏలూరు, జూన్ 22: గత కొంతకాలంగా అటవీ శాఖ పర్యవేక్షణలో ఉన్న పులి తాజాగా నది దాటి పోలవరం ప్రాంతం నుంచి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించినట్లు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పులి సిరివాక పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.


అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కొరుటూరు ప్రాంతంలోనే మకాం వేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పులిని గుర్తించి సురక్షితంగా పట్టుకునేందుకు నదీ తీరం వెంబడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైన బోన్లు, లాజిస్టిక్స్, వెటర్నరీ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

పులి కదలికలను నిరంతరం గమనిస్తూ, అవసరమైతే ట్రాంక్విలైజ్ చేసి పట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రాంతంలో జనావాసాలు లేవని, అది ఇంకా పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలోనే ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు, అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లా, మండల స్థాయిలో యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందన్నారు. గ్రామస్తులు ఎవరూ అక్రమంగా నది పరివాహక ప్రాంతాలకు చేపల వేట లేదా పశువుల మేత కోసం వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

అన్ని శాఖల అధికారులకు అప్రమత్తత సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పేరంటపల్లి శివాలయం వరకు టూరిజం కార్యకలాపాలను మూడు రోజుల పాటు పరిమితం చేయాలని టూరిజం శాఖకు లేఖ పంపినట్లు జిల్లా అటవీ శాఖాధికారి తెలిపారు.

ప్రజలు పులి సంచారంపై ఎలాంటి వదంతులను నమ్మకుండా, అటవీ శాఖ సూచనలను పాటించాలని అధికారులు కోరారు.