ఏలూరు, జూన్ 17: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి స్థానిక పత్తేబాదలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. వృద్ధులపై జరిగే వేధింపుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ సందర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 15న నిర్వహించే ప్రపంచ వృద్ధులపై వేధింపుల వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో ఈ నెలంతా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించి అక్కడి వృద్ధులు, నిరాశ్రయులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నట్లు చెప్పారు.
వసతి గృహంలో ఉన్న వృద్ధులకు వారి పిల్లల నుంచి అవసరమైన రక్షణ, వారికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ అంశాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని ఆమె తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వారికి వివరించి అవగాహన కల్పించినట్లు చెప్పారు.
వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది శ్రీమతి ఎ. గంగాభవాని, వసతి గృహ మేనేజర్ శ్రీమతి రేణుక, పారా లీగల్ వాలంటీర్ ఎం. మోహనరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

