ఏలూరు, జూన్ 17: జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం బుధవారం జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలు, డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ముందుగా ఏపీ ఎన్‌జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి మధ్యంతర భృతి మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, సరెండర్ లీవ్ నగదీకరణ బకాయిలను చెల్లించాలని కోరారు. అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడం, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులకు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జిల్లా శిక్షణ కేంద్రం పునరుద్ధరణ వంటి అంశాలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన ప్రతి సమస్యను పూర్తిగా అవగాహన చేసుకున్నానని తెలిపారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని, తన పరిధిలో లేని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌వో ఎల్. దేవకీదేవి, జెడ్పీ సీఈఓ పి. జగదాంబ, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యు. శోభ, డీసీహెచ్‌ఎస్ డా. సి.హెచ్. బేబీకమల, డీపీవో జి. మల్లికార్జునరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్.కె. షబ్నమ్‌తో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

