Ticker

6/recent/ticker-posts

ప్రకృతి వ్యవసాయంలో జీవామృతాల వినియోగంతో భూసారం పెరుగుతుంది


ఏలూరు/బుట్టాయిగూడెం, జూన్ 17: బుట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెం గ్రామంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ ఆదేశాల మేరకు బుధవారం రైతుల సమక్షంలో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం తయారీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ జీవామృతాల తయారీ, వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.


ఈ సందర్భంగా డివిజనల్ ఇన్‌చార్జి, ట్రైనింగ్ అసోసియేట్ (ఎన్‌ఎఫ్‌ఏ) డి. మధుబాబు మాట్లాడుతూ ద్రవ జీవామృతం, ఘన జీవామృతం తయారీ విధానం, వాటి ప్రాముఖ్యతపై రైతులకు వివరించామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 300 కిలోల ఘన జీవామృతం, 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేసి రైతులకు ప్రత్యక్షంగా చూపించామని చెప్పారు.

ఆవుపేడ, ఆవుమూత్రం, బెల్లం, శనగపిండి, మట్టితో తయారయ్యే జీవామృతాలు భూమిలో సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి భూసారాన్ని పెంపొందిస్తాయని వివరించారు. ఘన జీవామృతం నేలలో పోషకాలను అందుబాటులోకి తెచ్చి వేర్ల అభివృద్ధికి దోహదపడగా, ద్రవ జీవామృతం మొక్కలకు తక్షణ పోషకాలను అందించి పెరుగుదలను వేగవంతం చేస్తుందని తెలిపారు.

ద్రవ జీవామృతం వినియోగంతో నేలలో జీవక్రియలు చురుకుగా మారి పంటల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత మెరుగుపడుతాయని పేర్కొన్నారు. అలాగే భూమిలో తేమ నిల్వ సామర్థ్యం పెరిగి రసాయన ఎరువులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో భూమి ఆరోగ్యాన్ని కాపాడే ఈ ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్‌లను ప్రతి రైతు స్వయంగా తయారు చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ చి. వెంకటేష్, ఐసీఆర్‌పీలు, గ్రామ రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.