Ticker

6/recent/ticker-posts

జీవవైవిద్య పరిరక్షణతోనే మానవ జాతి మనుగడ సాధ్యం: ప్రొఫెసర్ సూర్జిత్ విక్రమన్


ఏలూరు, జూన్ 17: మానవ జాతి మనుగడకు జీవవైవిద్య పరిరక్షణ అత్యంత అవసరమని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (NIRD) పరిశీలకులు ప్రొఫెసర్ సూర్జిత్ విక్రమన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో “జీవవైవిధ్య చట్టం–2002 సమర్థవంతమైన అమలు” అంశంపై బుధవారం ఒక రోజు శిక్షకుల శిక్షణ (టీఓటీ) కార్యక్రమం నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు చైర్‌పర్సన్ నీలయపాలెపు విజయకుమార్, సభ్య కార్యదర్శి పి. రామకృష్ణ, ఐఎఫ్‌ఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, జీవవైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) సభ్యులు సహా 50 మందికి పైగా పాల్గొన్నారు.

శిక్షణలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో జీవవైవిధ్య నిర్వహణ అంశాలు, విధులు, బాధ్యతలు, కార్యాచరణ ప్రణాళికలు, వాటి అమలు, ఔషధ మొక్కల సంరక్షణ, వ్యాపార యోగ్యమైన జీవ వనరుల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. జీవవైవిధ్య సంపదను కాపాడుకోవడం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించవచ్చని వక్తలు వివరించారు.

ప్రొఫెసర్ సూర్జిత్ విక్రమన్ పర్యవేక్షణలో మాస్టర్ ట్రైనర్లు బి. జానకీరావు, వి. సత్యప్రసాద్, వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ పి. సారా, ఎ. సత్యగౌరీ పార్వతి పాల్గొని జీవవైవిధ్య చట్టం అమలు, సంరక్షణ చర్యలు, జీవ వనరుల నిర్వహణపై శిక్షణ అందించారు.

శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. జగదాంబ, జిల్లా పంచాయతీ అధికారి జి.వి.కె. మల్లికార్జునరావు, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ జి. ప్రసంగిరాజు శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో లింక్ ఆఫీసర్ కె. సుశీల, ఎస్‌ఐఆర్‌డీ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, డీపీఆర్‌సీ రిసోర్స్ పర్సన్లు జీడీ శ్రీనివాసరావు, యువ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.