INDAI NEWS, JUN 07: రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సొంత పార్టీపై బాంబ్ పేల్చారు. తాను దాదాపుగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖాయం అయిన సమయంలో ఒక కుట్ర అన్నింటిని తలకిందులు చేసిందని ఆయన అన్నారు. ఈ నిజం ఇప్పటికీ ప్రజలకు తెలియదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం ఎన్నికల గురించి చర్చ నడిచింది. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అశోక్ గెహ్లాట్‌ను జాతీయాధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను దాదాపుగా కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతున్న సమయంలో, రాజస్థాన్ పరిస్థితుల్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పరిశీలకుల్ని పంపిందని, ఆ తర్వాత పరిస్థితి వేగంగా మారిపోయిందని ఆయన అన్నారు. ఈ మొత్తం సంఘటన వెనక ఒక పెద్ద కుట్ర ఉందని, తనను కాంగ్రెస్ అధ్యక్షుడు కాకుండా అడ్డుకుందని చెప్పారు.
ఈ సమయంలో తాను రాజస్థాన్ సీఎం పదవి వదులుకునేందుకు ఇష్టం లేక అధ్యక్ష పదవిని వద్దనుకున్నట్లు ప్రజలు భావించారని, దేశవ్యాప్తంగా కూడా ఇదే పుకార్లు వ్యాపించాయని గెహ్లాట్ అన్నారు. తన సన్నిహితులు, మద్దతుదారులు కూడా ఇదే నమ్మారని చెప్పారు. ఈ కుట్ర తన ప్రతిష్టను దిగజార్చిందని చెప్పారు. కామరాజ్, మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి ప్రముఖ నాయకులను ఉదహరిస్తూ, కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి ఎల్లప్పుడూ అత్యంత గౌరవం ఉందని అన్నారు.

